అనంతపురం తెలుగు: కరువునేల మీద మాటల వైవిధ్యం
రెండున్నర ఎకరాలకు మించి విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను ఉన్నా, కనుచూపుమేర పచ్చదనం కనిపించదు. చోళసముద్రం, నాగసముద్రం, రాయలచెరువు... ఊర్ల పేర్లలో చెరువులు, సముద్రాలకు కొదవలేకపోయినా, అక్కడ నీళ్లు పారేది మాత్రం మనుషుల కళ్లలోనే! వజ్రాలు దొరికే వజ్రకరూరు, బంగారం లభ్యమయ్యే రామగిరి... ఉంటే మాత్రం ఏంటి, సామాన్యుల ముఖాలలో నాట్యమాడేది దైన్యమే!
పట్టుచీరలకు పేరుమోసిన ధర్మవరమూ అక్కడిదే... అయితేనేం! చాలామంది శ్రామికులకు వంటినిండా బట్టలు ఉండవు. పాతిక ఎకరాలున్న రైతు అయినా సరే, వరుసగా రెండేళ్లు వానలు కురవకపోతే ఇల్లూ నేలా వదిలిపెట్టి వలస పోవాల్సిందే. అలా అక్కడ కూటికీ, నీటికీ కొరతెంత ఉన్నా, భాషా, సాహిత్య, సాంస్కృతిక సంపదలకు కొదువలేదు. అదే అనంతపురం. అక్షర క్రమంలో మొదటిది, అభివృద్ధిలో ఆఖరిది అయిన ఈ జిల్లా... వైవిధ్యమైన తెలుగు మాటల తోటలకు మాత్రం పేరెన్నికగలది.
భౌగోళిక నేపథ్యం
ఊరికి చివరి గుడిసెలాగా ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ కొసన ఉందీ అనంతపురం. కరువుకు మారుపేరైన ఈ జిల్లా ఇటీవల కక్షలకు నిలయమైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ తరువాత దేశంలోనే అతి తక్కువ వర్షపాతంగల ప్రాంతమిదని పర్యావరణవేత్తల హెచ్చరిక. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న రెండు వేల చెరువుల్లో ఇప్పుడు 200 కూడా కనిపించట్లేదు.
నీటికి కటకటలాడే ప్రాంతం కాబట్టే ఉభయ గోదావరులకన్నా ఎక్కువ వైశాల్యం ఉన్నా, జనసాంద్రత చాలా తక్కువ. వేయి గ్రామాలతో ఉండే ఈ జిల్లాలో జనాభా మాత్రం 40 లక్షలకు కాస్త ఎక్కువ.
చరిత్ర, జనజీవనం
శాతవాహనులు, పల్లవులు, రాష్ట్రకూటులు, దేవగిరి యాదవులు, వైదుంబులు, విజయనగర రాజులు, హండే, కందుర్తి పాలకులెందరో ఏలిన గడ్డ ఇది. బుక్కరాయల భార్య అనంతమ్మ పేరిట ‘అనంతపురం’ నిర్మితమైందని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఒకప్పుడు బళ్లారి జిల్లాలో భాగమైన ఈ ప్రాంతం 1882లో ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది.
హిందూ–ముస్లిములు అధికంగా నివసించే ఈ జిల్లాలో మార్వాడీలు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలూ జీవిస్తున్నారు. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడి ప్రజలతో కలసి జీవిస్తున్నారు.
కన్నడ అనుబంధం, మిశ్రమ భాష
అనంతపురం జిల్లావాసులకు బెంగళూరుతో అనుబంధం అధికం. ఇచ్చిపుచ్చుకోవడాలు, వ్యాపారాలు, ఉపాధికోసం వలసలు—అన్నీ కర్ణాటకతోనే ఎక్కువగా జరుగుతుంటాయి. హిందూపురం, రాయదుర్గం, మడకసిర, విడపనకల్లు, కణేకల్లు, అమరాపురం ప్రాంతాలలో తెలుగు–కన్నడ మిశ్రమభాషలో మాట్లాడుతుంటారు.
కురవలు, జంగాలు, దళితుల్లో మాదిగలు (ఎక్కువభాగం), మాధ్వ బ్రాహ్మణులు వంటి వారిలో కన్నడ తల్లిభాషగా ఉండటం కూడా కనిపిస్తుంది.
ఇలావరిగా : వివరంగా దాండ్లకు : వాటికి తొగడం : తవ్వడం సాలకొత్తాది : చాలదు దరిచ్చి : ధైర్యం చేసి కువాడం : ఎగతాళి ముగబడు : అంగీకరించు నసుక్కు : తెల్లవారకముందే గగ్గెర్లు : ఎద్దు కొమ్ములకు వేసే గజ్జెలు వొరమానం : ఆదాయం రోపిచ్చు : ఏడిపించడం సొటకూతలు : పనికిరాని మాటలు పాపోడు : పిల్లవాడు బేడిజనం : బీదాబిక్కి జనం మోడం : మబ్బు పలకువ : జాడ తాలికబట్టు : ఓపికబట్టు వొరుపు : వర్షాభావం సొక్కటం : చక్కదనం నారవ : లోయ పిత్తరం రేగు : కోపం రావడం
అనంతపురం తెలుగులో ప్రత్యేక పదాలు
- అప్ప – గౌరవవాచకం (ఏమప్పా!)
- యాటికి – ఎక్కడికి
- లెక్క – డబ్బు
- పిరిం – ధర ఎక్కువ
- అగ్గవ – చవుక
- ఉగ్గాణి – బురుగుల్లో మసాలా కలిపిన పదార్థం
- వొగాల – ఒకవేళ
- రానీకి / పొయ్యేకి – రావడానికి / పోవడానికి
- తోలకరండి – పిలుచుకుని రండి
- వస్తాండాడు – వస్తున్నాడు
భాషా లక్షణాలు
- వలెను → వల్ల (పోవల్ల, రావల్ల)
- నేస్తుడు → న్యాత్తుడు
- తిండిలేక → తిండిల్యాక
- ఉర్దూ పదాలు: పీర్, ఆజాద్, జోర్, సలాం మొదలైనవి
- బంజారా–తెలుగు మిశ్రమ ప్రయోగాలు: గుడిన్ జామా, దేవళం జామా
సాహిత్యంలో స్థానిక భాష
కోగిర జైసీతారాం ‘చలిమంట’ కవిత, స్వామి రచనలు (గద్దలాడతండాయి మొదలైనవి), దస్తగిరి, శాంతినారాయణ, సింగమనేని నారాయణ కథలు—అన్నింటిలోనూ అనంతపురం స్థానిక భాష సజీవంగా కనిపిస్తుంది.
కరువు, వలసలు, కక్షలు ఎంత ఉన్నా— రసజ్ఞత మాత్రం చావలేదు. అదే అనంతపురం తెలుగు బలం.
