తెలంగాణ తెలుగు: పదాల గమగమలు, నుడికారపు నెరపులు
నీళ్లు జోడుకునే (చేదుకునే) బావిని తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో బాయి అంటారు. బా‘వి’లోని వకారం పోయి ‘యి’ మిగిలింది. జానపదుల మాట తీరిది. అయితే ఈ బావిని ఆదిలాబాదులో నూతి అని పిలుస్తారు. ఇది నుయ్యిలోంచి వచ్చిన ఔపవిభక్తిక రూపం. నుయ్యి, నూతి పదాలు సైతం బావి లాంటి తెలుగు పదాలే!
ఇక ఆ బావి లేదా నూతిలోంచి నీళ్లు పైకి చేదుకునే సాధనం బొక్కెన. దీన్ని ఆదిలాబాదు జిల్లాలో కోర అంటారు. ఇది సహజత్వాన్నీ, ప్రాంతీయ ముద్రనూ నిలుపుకున్న ఆ ప్రాంత నుడి. మరి ‘కోర’కు నిఘంటువులు ఏమని అర్థవివరణ చేశాయి? ‘గిన్నె, కల్లు తాగెడు గిన్నె, తట్ట’ అని చెప్పాయి. బావిలోంచి నీళ్లు పైకి తోడుకునే పనిముట్టు.. ఓ గిన్నె లేదా తట్ట లాంటి పనిముట్టే కదా!
కోలలు ఏసుడు – కోలాటం ఆడుడు
తెలంగాణలో కోలలు ఏసుడు, కోలాటం ఆడుడు అని రెండు రకాల ఆటలున్నాయి. ఈ రెండింటిలోనూ ఆటా పాటా ఉంటాయి. మరి తేడా ఏంటి?
‘కోల’ అంటే దండం. సన్నని ఒకింత నిడుపాటి కర్ర. కోలాటం పదానికి మాతృక తమిళ భాషలోని ‘కోలాట్టం’. కోల్ + ఆట్టం అనే రెండు పదాల కలయిక ఇది. కోల్ అంటే కోల. ఆట్టం అంటే ఆట.
తమిళ తోట్టం → తోట, కోట్టం → కోట అయినట్లూ జరిగిన మార్పు ఇది. అయితే కోలాటంలో తమిళ ఆట్టం ఏ రకమైన మార్పూ లేక నిలిచి ఉండటం విశేషం (ఒత్తు తప్ప).
ఇక తెలంగాణలో ‘కోలె’ అనే అవ్యయమూ ఉంది. నిజానికిది చివర్లో ద్రుతం ఉన్న ‘కోలెన్’ అనే రూపంలో ఉండాలి. అయితే భాషలో ఈ ద్రుతం జారిపోవడం సర్వసాధారణం. ఈ ‘కోలె’ అవ్యయం చాలా ప్రాచీనమైంది. అయినప్పటికీ ఈనాటికీ తెలంగాణలో, ముఖ్యంగా పల్లెవాసుల పలుకుల్లో నిక్షిప్తమై ఉంది.
“ఏమో! శిమాంట పండుగ్గోలె వచ్చినవు ఏందయ్యా?”
ఇందులోని ‘గోలె’ పదమే పాతకాలంనాటి కోలె. నన్నయ ఆదిపర్వంలో:
“దాని వత్సంబు నిన్నట గోలె నుడుగక యఱచుచునున్న యదియు”
దీనికి ‘నుంచి, మొదలు, సమయం’ తదితర అర్థాలు చెప్పుకోవచ్చు.
కయ్యలూ కైనీడలూ
శబ్దరత్నాకర నిఘంటువులో కయ్య అనే పదానికి మడి అనే నుడిని అర్థంగా చూపించినా, ఇంకొకచోట ‘క్రయ్య’కు కాలువ అనే అర్థాన్ని ఇచ్చారు సీతారామాచార్యులు. తెలంగాణలో ఈ పదం మరో అర్థంలో బాగా వాడుకలో ఉంది.
వాగుల్లో అక్కడక్కడా నీళ్లు లోతుగా నిలిచిన కయ్యలు ఉంటాయి. ఇవి మడుగుల్లాంటివి. వీటిలో ఈతలు కొడుతుంటారు సాధారణంగా. కాబట్టి నైఘంటికార్థానికి—అంటే కాలువ అనే అర్థానికి—సమానంగా ఉన్న నీటి సంబంధిత పదమే తెలంగాణలో ఉంది.
ఇంకా తిండిపోతుల్ని చూసి:
“వానిది కడుపా కయ్యా?”
అని ప్రశ్నిస్తారు — “కడుపా కళ్లేపల్లి చెరువా?” అనే అర్థంలో.
విద్యుత్తు సౌకర్యం లేని ఆ రోజుల్లో దీపాల కిందే కొంత చీకటి ఉండేది. ఆ ఇరులు దీపం తాలూకు నీడలు. ఈ నీడను సాధారణంగా ‘క్రీనీడ’ అని వ్యవహరిస్తే, తెలంగాణలో దీన్ని ‘కైనీడ’ అంటారు. క్రీనీడలోని క్రి = క్రింద. ఈ ‘క్రి’ అక్షరమే తెలంగాణలో కై అయిపోతుంది.
అస్తమయ సమయాన్ని చెప్పడానికి పొద్దు గుంకింది అంటారు. పొద్దు అంటే సూర్యుడికీ, సమయానికీ ముద్దుగా ఉన్న తెలుగు మాట. గుంకింది గురించి… ఇది నిజానికి ‘కుంకింది’. క్రుంకు అంటే మునుగు అని అర్థం. పడమటి కొండల చాటున మునగడం, పశ్చిమ సముద్రాలకు ఆవల మునగడం ఈ పొద్దు కుంకడం.
కొత్తంత పండగ లేదు…
తెలుగు వాళ్లందరికీ నూతన సంవత్సరాది గొప్ప పర్వదినం. దీన్నే ఉగాదిగా పిలుస్తాం. నిజానికిది యుగాది. యుగం అంటే ఇక్కడ సంవత్సరం అని. యుగాది పదమే ఉగాదిగా స్థిరపడింది.
అయితే ఇలాంటి కొత్త సంవత్సరం తాలూకు పండగే మరొకటి తెలంగాణలో ఉంది. దాని పేరే కొత్త పండగ. కొత్తగా పంటలు పండి ఇంటికి వచ్చిన సందర్భంలో ఈ పబ్బం అబ్బురపడేలా చేసుకుంటారు.
- ఆ రోజు కొత్త బియ్యాన్ని వండుకుంటారు
- ఇంటిలో ఉన్న కుందెన, కుదురు, రోలు, రోకలి లాంటి ఉపకరణాల్ని సున్నమూ, జాజులతో చక్కగా అలంకరిస్తారు
- వాటిని పూజిస్తారు
- ఇంటిల్లిపాదీ కలిసి భోంచేస్తారు
ఇది తెలంగాణలో ఎంత గొప్ప పర్వదినం అంటే:
అనే సామెత కూడా ఉంది. కొత్త పదం ఉత్తమమైన తెలుగు పదమే!
పుల్లంగొయ్య: పిల్లంగ్రోవి నుంచి వచ్చిన మాట?
ఇక పుల్లంగొయ్య చరిత్ర. ఏంటిది? పిల్లంగ్రోవి. ఇదే పిల్లనగ్రోవి రూపంలో ఉంది. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. తెలంగాణలో వినిపించే పదం మాత్రం పుల్లంగొయ్య.
- క్రోవి అంటే గొట్టం
- పిల్లనగ్రోవిలో రంధ్రాలతో ఉన్న గొట్టమే కదా ఉండేది
- కొయ్యతో తయారైంది కాబట్టి గొయ్య అన్న నుడి వచ్చింది
అన్నట్టు, పిల్లనగ్రోవి / పుల్లంగొయ్య అనే పిల్లపదాలకు తల్లిపదం తమిళంలో ఉంది: పుల్లాంగుళల్, కుళల్ అంటే గొట్టం. పుల్లాంగుళల్ ↔ పుల్లంగొయ్య — శబ్దసామ్యం స్పష్టంగా వినిపిస్తుంది.
గండు… గచ్చు
తెలుగులోని రేనుపండ్లు వర్ణవ్యత్యయం చేసి తెలంగాణలో నేరిపండ్లు అంటారు. కొందరు రేగుపండ్లనీ, రేనుపండ్లనీ పిలవడం కద్దు. పెద్దగా ఉన్న పండ్లను గంగరేనుపండ్లు అంటారు. ఈ సమాసంలోని గంగ అంటే పెద్ద అని అర్థం.
ఇంకొక పదం గంజు. దీనికి అర్థాలు: అంగడి వీధి, మార్కెట్టు, బజారు. తెలంగాణలో:
“గంజులకు పోయిండా?”
అంటే షావుకార్ల వ్యాపార స్థలం అనే భావం ఉంది.
మరి గండ్ర అంటే? పెద్దది అని అర్థం. గండ్రచీమలు అందుకనే మామూలు చీమలకన్నా పెద్దగా ఉంటాయి. తెలంగాణలో ఇవి గండుచీమలుగా వ్యవహృతమవుతున్నాయి.
ఇక గగ్గోలు అంటే కలత, దోషం. చాలా చిత్రంగా ఈ పదం గగ్గోడుగా మారి వ్యవహారంలో ఉంది. కారణాంతరాల వల్ల తొడలూ, చంకల సందుల్లో దిగిన వాపును తెలంగాణీయులు “గగ్గోడు వచ్చింది” అంటారు. గజ్జల్లో దిగిన ఈ ఉబ్బూ, వాపూ ఆందోళనకు గురి చేస్తుంది కాబట్టి, క్షోభ పెడుతుంది కాబట్టి దీన్ని గగ్గోడు అన్నారు. ఇది మంచి తెలుగుతనం ఉన్న పదం.
ఇళ్లలో ఇప్పుడు మార్బుళ్లు వేసుకుంటున్నా, పూర్వం గచ్చు చేయించుకునేవాళ్లు. కొందరు నాపరాళ్లు వేయించుకునేవారు. పేదలు నేలతోనే సరిపెట్టుకుంటారు. గచ్చు అంటే సిమెంటుపూత. నిఘంటువులు దీన్ని పూత, గారపూత అని అర్థం చెబుతాయి. సిమెంటు ఆధునిక కాలంలోది కాబట్టి దీన్ని గచ్చుకు అన్వయింపచేశారు తెలుగువాళ్లు. ఏది ఏమైనా—గచ్చు అచ్చమైన దేశిపదం.
పశువుల్ని తరమడం అనే అర్థంలో తెలంగాణలో గెదుముడు అనే పదప్రయోగమూ వినపడుతుంది. అప్పుడప్పుడు మనుషులకు కూడా దీన్ని అన్వర్తింపచేస్తారు. ఈ గెదుము క్రియకు మూలరూపం గదుము — గద్దించు అనే అర్థంలో ఉన్న సకర్మక క్రియ.
పదాల గమగమలు
పశువుల కొట్టాల నుంచీ, గొర్రెలు మేకల మందల నుంచి వచ్చే దుర్గంధాన్ని గెదరు వాసన అంటారు. ఇది తెలుగులోని గదరు పదం చిన్న మార్పు.
తెలుగులో వాసనలకు ధ్వన్యనుకరణలు గుమగుమ, గమగమ అని రెండున్నాయి. తెలంగాణలో:
“అబ్బా! ఎంత మంచిగ గమగమ వాసనలు వస్తున్నై. ఎప్పుడు వడ్డన చేస్తరో మరి!”
అంటుంటారు. ఈ గమగమ కమ్మని తెలుగు మాట.
తెలుగులో గాలికి సమానార్థకంగా గాడుపు పదం కూడా ఉంది. తెలంగాణలో బాగా చదువురాని మంది గాలికి మారుగా గాడ్పు అని అంటారు. ఇది మంచి అమ్మ నుడి.
ఇక గావు—దేవతలకు బలిచ్చే సందర్భాల్లో ఈ పదాన్ని వాడుతారు. పోతురాజులు తమ దంతాలతో మేకపోతుల్నీ, గొర్రెపోతుల్నీ కొరికి గావు పడతారు. గావు అంటే బలి అని అర్థం.
“గొప్ప చింబోతు కదుపుల గూర్చి నీకు, గావు వెట్టింతు జుమ్మి యో గంగనమ్మ”
అని నీలాసుందరి పరిణయం తేటగీతి పంక్తులు చెబుతున్నాయి. గావుపట్టు అంటే చంపు / నాశము చేయు అనే అర్థాలున్నాయి. ఒకవిధంగా చావు పదమే గావు అయి ఉండొచ్చు—విలోమ తాలవ్యీకరణం.
గిడ్డుగాడు… గిర్వి
చెవులు రింగుమనడం మనం విన్నదే. తెలుగుతల్లి గీతంలో:
“మా చెవులు రింగుమని మారుమోగేదాక”
ఉన్నదే. అయితే తెలంగాణలో ఇది గింగురుమనడం.
“అబ్బా! నా చెవులన్ని గింగురుమంటున్నై!”
అని అంటుంటారు.
“వాడు గిడ్డుగాడు” అనే మాటలు కూడా తెలంగాణలో వినిపిస్తాయి. పొట్టివాడు, మరుగుజ్జు అనే అర్థంలో. ఇది తెలుగులోని గిడ్డ (పొట్టి, వామనుడు) అనే పదానికి దగ్గర.
ఇక తాకట్టు అనే అర్థంలో తెలుగులో గిరవు అనే పదం ఉంది. ఇది తెలంగాణలో గిర్వి అయ్యింది. ఇదే అర్థంలో తెలుగులో కుదువ పదమూ ఉంది. ఇది తెలంగాణలో కుద అయ్యింది.
“ఎక్కడ కుద పెట్టి రావాలె?”
లాంటివాక్యాలు సాధారణం.
గిలకొట్టుడు – చక్కిలిగులగుల
తెలంగాణలో:
“ఇప్పుడే పెరుగుల నీళ్లు పోసి కుండల పోసిన. జెర్రసేపు ఆగు. ఆయింత గిలకొట్టి వస్త”
అంటుంటారు. పెరుగును కుండలో పోసి కవ్వంతో చిలికి వెన్న తీయడం ఇళ్లలో ఉండే పద్ధతి. పాలూ పెరుగు తక్కువగా ఉన్నప్పుడు కొందరు పెరుగును పాత్రలో వేసి చేతివేళ్లతోనే చిలుకుతారు. దీన్నే గిలకొట్టుడు అంటారు. బహుశా చిలకడం → గిలకొట్టుడుగా మారి ఉండొచ్చు (తాలవ్యీకరణం ఉల్టా).
“గిలిగింత, చక్కలిగింత, గిలిగిలి” వంటి మాటలకు తెలంగాణలో సమానమైన పదం:
ఇది చక్కిలిగింతలోని “చక్కిలీ” + “గిలిగిలి” కలిసి మొదట చక్కిలిగిలిగిలిగా, ఆ తర్వాత చక్కిలిగులగులగా మారినట్టుగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని నవ్వించడానికి చంకల్లో వేళ్లుపెట్టి చక్కిలిగులగుల చేయడం సాజం!
అదంతా జాను తెలుగు
‘చేను’ అనే అర్థం కలిగిన గుడ్డము పదం ఇప్పటికీ పల్లెల్లో వినిపిస్తుంది. వరిపొలాలు కానటువంటి చేనుల్ని, చెలకల్ని గుడ్డాలు అని పిలుస్తారు.
“నాకు మస్తు బుగులు బుగులుగ వున్నది” అనే వాక్యంలో బుగులు అంటే భయం. ఇది తెలుగులోని గుబులు పదం వర్ణవ్యత్యయంతో మారిన రూపం.
“వాడు నా వీపు మీద గిపుకుగిపుకున గుద్దిండు” అనే వాక్యంలో ‘గిపుకు’ ధ్వన్యనుకరణ పదంలా ఉంటుంది. తెలుగులోని గుముకు (పిడికిటితో పొడుచు) అనే అర్థం కలిగిన క్రియతో శబ్దసామ్యం కనిపిస్తుంది.
ఇలా ఇప్పటికీ తెలంగాణలో వందలు, వేలాది పదాలు తెలుగుతనంతో తొణికిసలాడుతున్నాయి. పైగా అవి పల్లెజనాల రసనల్లోంచి జారిపడే అనల్పార్థ రచనలు. వాళ్లు వాడేవి అల్పాక్షరాలే కావచ్చు. సోమన చెప్పినట్టు వాటిని “కొలదిమాటలు” అనంగవలదు. ఉరుతర పద్యోక్తులు కాకున్నప్పటికీ అవి సరసమై పరగిన జానపదుల జానుతెలుగు పలుకులు. ఆ వాక్కులు వాకలై పారుతూ, తీగలై సాగుతూ తెలంగాణలో నిలిచి ఉండటమే ఓ ప్రత్యేకత!
